కిలిమంజారోపై త్రివర్ణ పతాకం
* సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరుదైన ఘనత
* మాజీ సైనికోద్యోగి కుమారుడి సాహసం
మణికొండ,(విజయక్రాంతి): సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఆకాశమే హద్దని నార్సింగికి చెందిన పలమడ హితేష్ నిరూపించారు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కొనసాగుతూనే పర్వతారోహణపై ఉన్న మక్కువతో ప్రపంచంలోనే నాలుగో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. మాజీ వైమానిక దళ ఉద్యోగి పలమడ రమణ కుమారుడైన హితేష్ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన దేశభక్తి, క్రమశిక్షణతో ఈ సాహసానికి పూనుకున్నారు.
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఆఫ్రికా ఖండంలోని అత్యున్నత శిఖరంపై అడుగుపెట్టి భారత జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేసి దేశ ఖ్యాతిని చాటారు. అలకాపూర్ రోడ్ నెం.16 నివాసి అయిన హితేష్ సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల స్థానికులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో తీరిక లేని పని ఒత్తిడిలోనూ పర్వతారోహణ వంటి సాహస క్రీడలో రాణించడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు. తమ మిత్రుడు రమణ కుమారుడు ఇంతటి విజయాన్ని సాధించడం గర్వకారణమని స్థానికులు కొనియాడారు.




