07-01-2026 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారనిపిస్తున్నది. తాను సంతోషంగా లేనన్న సంగతి భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని, త్వరలోనే భారత్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తానంటూ విడ్డూరంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది. ట్రంప్ తాజా ప్రకటన ఆయన అహంకారపూరిత ధోరణిని బయటపెట్టింది. ఇప్పటికే భారత్‌పై అమెరికా అత్యధికంగా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తన మాట లెక్క చేయకుండా రష్యాతో ముడి చమురు వ్యాపారాన్ని భారత్ కొనసాగిస్తుందన్న అక్కసుతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తున్నది.
రష్యాతో అమెరికాకు వైరం ఉండొచ్చు.. కానీ మనతో రష్యాకు ఎలాంటి శత్రుత్వం లేదు. రష్యానే కాదు అమెరికాతో కూడా మనం ఎప్పుడూ సఖ్యతగానే మెలుగుతూ వస్తున్నాం. ఇటీవలే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరిగినప్పుడు కూడా అమెరికాతో మంచి అనుబంధాన్నే కొనసాగించాం. ఇక అవకాశం చిక్కినప్పుడల్లా భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ను భారత్ ఏనాడు ఒక్క మాట అనలేదు. మా మధ్య జరిగిన యుద్ధంలో మూడో దేశం ప్రమేయం లేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే యుద్ధం ముగిసిందని భారత్ పేర్కొంటూ వచ్చింది.
గత నెలలో భారత్‌లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. అమెరికాతో భారత్ ద్వుపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్నా, పుతిన్ అవేవీ పట్టించుకోకుండా మోదీతో సంప్రదింపులు జరపడంతో పాటు పలు ఒప్పందాలను చేసుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం భారత్ అంటే తనకు ఇష్టమంటూనే నచ్చని దేశంతో వ్యాపారం చేస్తున్నందున సుంకాలు విధిస్తానంటూ వికృత చర్యలకు పాల్పడుతున్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఆయనలో అహంకారం పెరిగింది. తన దుందుడుకు చర్యలతో ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వలసలు అరికట్టేందుకే వెనిజులా దేశంపై దాడులు చేసినట్లు చెప్పుకున్న ట్రంప్ ఏకంగా ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, సతీమణి సిరియా ఫ్లోరేస్‌లను న్యూయార్క్‌కు బందీలుగా తరలించిన వైనం ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది.
తాను చేసింది సరైనదేనని సమర్థించుకున్న ట్రంప్ ఆపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్‌ను సైతం ‘మేం చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయి’ అని హెచ్చరించారు. ‘వెనిజులా కథ ముగిసింది.. ఇప్పుడు మెక్సికో, క్యూబా, గ్రీన్ ల్యాండ్ వంతూ’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యాధిపత్యమనేది తన ప్రవర్తన, మాటతీరును బట్టి వస్తుందనే విషయం ట్రంప్‌కు తెలియకపోవడం దురదృష్టకరం.
రెండో దఫా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మాటలకు, చేష్టలకు సంబంధం లేకుండా ట్రంప్ పాలన కొనసాగుతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీంతో ట్రంప్ పాలనపై సొంత దేశ ప్రజలే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచార సమయంలో, ఆ తర్వాత కూడా దోస్తీ కొనసాగించిన ఎలాన్ మస్క్.. ట్రంప్ వికృత చేష్టలు నచ్చకనే దూరమయ్యారు. ఇప్పటికైనా ట్రంప్ తన అహంకార భావాన్ని వదిలి పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది.