19 May, 2026 | 6:21 PM

Breaking News

లైలా గెటప్‌లో విశ్వక్ కసక్‌లా అనిపిస్తున్నాడు

09-02-2025 10:48 PM

‘లైలా’ మెగా మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి..

విశ్వక్‌సేన్ నటించిన తాజాచిత్రం ‘లైలా’. ఆకాంక్షశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను రామ్‌నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

‘మెగా మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పేరుతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ హీరో చిరంజీవి, విశిష్ట అతిథిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “విశ్వక్‌సేన్ ఫంక్షన్‌కు వెళ్తున్నావా? అని మా ఇంట్లో అడిగారు.. ‘అతను మన మనిషి కాదని.. బాలకృష్ణ, అప్పుడప్పుడు తారక్ పేర్లు చెబుతుంటాడు’ అన్నారు.

మనుషులంటే వేరే వాళ్లమీద ప్రేమ, అభిమానం ఉండకూడదా? ఫంక్షన్‌కు నేను వెళ్లకూడదా? అని ఎదురు ప్రశ్నించాను. విశ్వక్‌కు కూడా ఇలాంటి ప్రశ్నే విలేకరులు అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కగా ‘మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు’ అని సమాధానం చెప్పాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను.

అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరులో మా కజిన్స్ ఒకరు రామరావు గారిని, ఒకరు ఏఎన్‌ఆర్ గారిని అభిమానించి ఒకరినొకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే ఉంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సఖ్యత సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను.

మద్రాస్‌లోని హనీ హౌస్‌లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్లం. ఇప్పటికీ బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున మేమంతా కలసికట్టుగా ఉంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా ఉండాలి. ‘పుష్ప 2’ పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిందంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ అంతటికీ ఒకటే కాంపౌండ్.

ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెల్లుబికింది. లైలా గెటప్‌లో విశ్వక్ కసక్‌లా అనిపిస్తున్నాడు (నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది (నవ్వుతూ). అంత గ్లామర్‌గా ఉన్నాడు. నేను, నరేశ్, రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ‘లైలా’ కూడా హిట్ గ్యారెంటీ. తప్పకుండా ఈ సినిమాకు ఆడియన్స్ వెళ్తారు.

ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్.. ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళల గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్యు సింగ్, పృథ్వీ, ఆకాంక్ష, కామక్షి అందరూ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్‌” అన్నారు.  

అనిల్ రావిపూడితో నా సినిమా.. వేసవిలో ఆరంభం... 

ఇదే వేదికపై చిరంజీవి తన తర్వాతి సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ‘సాహు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. సినిమా సమ్మర్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది ఆద్యంతం కామెడీగా ఉంటుంది. ఎప్పుడు సెట్స్‌లోకి వెళ్లి నటిస్తానా అనే ఉత్సాహం ఉంది. సాహు, గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు’ అని వెల్లడించారు. 

చిరంజీవి కళ్లలో ఆనందమే నాకు అవార్డు.. 

అంతకుముందు విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కళ్లలో ఒక ఆర్టిస్ట్ ఆనందంగా ఫీలవ్వడం కనిపించింది. అది నాకు ఫస్ట్ అవార్డ్, రివార్డ్. మా నాన్న చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. రాజకీయాల్లో ఆయన అనుచరుడిగా ఉన్నప్పుడు మా కారు ఎవరో కాల్చేశారు. అది న్యూస్‌గా వచ్చింది. మేము భయంలో ఉన్నాం. డాడీ ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశాను.

హలో ఎవరు అంటే.. నేను చిరంజీవి అనే వాయిస్ వినిపించింది. వెంటనే డాడీకి ఫోన్ ఇచ్చాను. అప్పుడు అనిపించింది మా కారు కాలిపోవడం మంచి పని అయ్యిందని (నవ్వుతూ). కారు కాలిపోయిందనే దిగులు మర్చిపోయి చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం. అదొక మెమరబుల్ మూమెంట్. నా సినిమాకు ఆయన సపోర్ట్ చేయడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చింది సాహు గారు. ఇది నా కెరీర్‌లో స్పెషల్ మూవీ.

ఈ కథకు న్యాయం చేశానని నమ్ముతున్నాను. రామ్ కథ చెప్పినప్పుడు నవ్వించాడు. నేను జనాల్ని నవ్వించాలని డిసైడ్ అయ్యాను. మెంటల్ హెల్త్‌కు మించిన రిచ్ నెస్ మరొకటి లేదు. మెంటల్ పీస్ ఉన్నవాడు అందరికంటే ధనవంతుడు. ఎవరికీ హాని చేయకపోడమే మనం చేసే పెద్ద హెల్ప్. సంక్రాంతికి అనిల్ అన్న అందరినీ నవ్వించే సినిమా చేశాడు.

అన్నదానం ఎంత గొప్పదో మంచి వినోదం ఉన్న సినిమా తీయడం కూడా అంత గొప్పది. అదే ప్రయత్నం మేము ‘లైలా’తో చేశాం. ఫిబ్రవరి 14న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. సరదాగా ఎంజాయ్ చేయండి. లియోన్ జేమ్స్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నిర్మాత సాహు గారికి, అర్చన గారికి థాంక్ యూ. లవ్ యూ మెగాస్టార్ సర్. లైఫ్‌లో గుర్తుండిపోయే రోజు ఇది” అన్నారు. 

ఈ కార్యక్రమానికి మరో అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “విశ్వక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను లైలాగా మారిన వీడియో చూసినప్పుడు తన పడిన కష్టం కనిపించింది. ఒక హీరో హీరోయిన్‌గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సాహు నా మిత్రుడు. మేము బాలయ్యతో సినిమా చేసాం.

మళ్లీ మా ఇద్దరం కలిసి చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాం. చిరంజీవి గారు రీసెంట్‌గా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇది మెమొరబుల్ జర్నీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఒక జనరేషన్‌ను శాసించిన గొప్ప స్టార్ చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్‌కూ ఓ కల. నాకు ఆ అవకాశం వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత చిరంజీవి గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను” అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష శర్మ మాట్లాడుతూ.. ‘ఇది నా తొలి తెలుగు ఫిల్మ్. చిరంజీవి గారి సమక్షంలో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ లైలా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం. ఆయన నాకు ఇందులో టఫ్ కాంపిటేషన్.

ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు ధన్యవాదాలు’ తెలిపారు. చిత్ర దర్శకుడు రామ్‌నారాయణ మాట్లాడుతూ.. “నాకు సినిమా తెలిసింది చిరంజీవి గారి వలనే. ఆయన్ని ప్రత్యక్షంగా చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ గారి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. విశ్వక్ కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను’ అన్నారు. 

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. “అనిల్ రావిపూడిని తన సినిమా ప్రమోషన్స్ ఆపేయమని అడుగుతున్నాను (నవ్వుతూ). చిరంజీవి గారు మా ఈవెంట్‌కు వచ్చారు కాబట్టి ఇకపై మా ప్రమోషన్స్ కనిపిస్తాయి. విశ్వక్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడున్న స్టార్స్‌లో ఈ క్యారెక్టర్ చేయడానికి అంత డేరింగ్ ఎవరూ చేయరు. చాలా అద్భుతంగా ఈ క్యారెక్టర్‌ను చేశాడు. తన మ్యాజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్ చూస్తారు.

చాలా అద్భుతంగా కష్టపడి పనిచేశారు. డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అద్భుతంగా స్క్రీన్‌పైకి తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆడియన్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు అభిమన్యు సింగ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, రైటర్ వాసుదేవ్ మూర్తి, లిరిక్ రైటర్స్ పెంచల్ దాస్, పూర్ణాచారి, భాను మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.