7 August, 2026 | 3:18 AM

కల్లుగీత కార్మికుల చైతన్య యాత్రకు చిరుమర్తి లింగయ్య సంఘీభావం

07-08-2026 02:09 AM

చిట్యాల, ఆగస్టు 6: రాష్ట్ర కల్లుగీత కార్మికుల సంఘం చేపట్టిన చైతన్య యాత్రకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. గురువారం నకిరేకల్ నియోజకవర్గం మీదుగా సాగిన యాత్రలో పాల్గొన్న ఆయన, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.

ఎన్నికల హామీల ప్రకారం కల్లుగీత కార్మికులకు నెలకు రూ.4,000 పింఛన్, ప్రమాద భీమా పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, వన సంరక్షణతో పాటు వారి ఉపాధి అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తామని ప్రకటించినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కేసీర్ హయాంలో ప్రమాదాలకు గురైన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా కొద్ది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేదని, ప్రస్తుతం రూ.20 కోట్లకు పైగా ఎక్స్గ్రేషియా బకాయిలు పెండింగ్లో ఉండటంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. జిల్లాలో సుమారు 25 వేల మంది కల్లుగీత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్న చిరుమర్తి లింగయ్య, ఎన్నికల హామీల ప్రకారం రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల ప్రమాద భీమా పరిహారం, వృత్తి అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.