11 August, 2026 | 5:47 AM

చిత్రపురి కాలనీ స్కాం.. పోలీసు కస్టడీకి వల్లభనేని అనిల్

26-05-2024 12:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి) : చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో కేసును మరింత లోతుగా విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతూ రాయదుర్గం పోలీసులు శనివారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అనిల్‌ను కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది.

దీంతో రెండ్రోజుల పాటు అనిల్‌ను కస్టడీలోకి తీసుకుని రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు. ఈ స్కాంలో మిగతా సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయనున్నారు. ప్లాట్ కోసం మాదాపూర్‌కు చెందిన తోట శ్రీపద్మ రూ.12 లక్షలు చెల్లించింది. అయితే, తనకు కేటాయించిన ప్లాటును మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని ఆమె మార్చి 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. యనమల మాధ వ్ కూడా రూ.4 లక్షలు చెల్లించాడు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్ కేటాయింపును కమిటీ సభ్యులు రద్దు చేశారని, తాను చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని మార్చి 20న ఫిర్యాదు చేశాడు.

వీరి తోపాటు బక్కి విద్య, కాట్రగడ్డ రవితేజ, జయశ్రీ, శ్రవణ్‌కుమార్ కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపు కమిటీలోని వల్లభనేని అనిల్, పరుచూరి వెంకటేశ్వ రరావు, వినోద్‌బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డితో పాటు మరికొందరిపై కేసు బుక్ చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాధితులు 150మంది వరకు ఉంటారని, ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూ లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.