నీటి వనరులకు రక్ష
రాష్ట్రంలో వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం
* అన్ని రంగాలకు 24 గంటల కరెంటు
* పర్యావరణ పరిరక్షణకు సూచనలివ్వండి
* నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్
* హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ ఎనర్జీ వర్క్‌షాప్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రత్యేక వాటర్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నగరంలోని బేగంపేటలో ఉన్న హరితప్లాజాలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి వనరులను సంరక్షించేందుకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్య ఉద్గారాల కారణంగా భూమి వేడెక్కుతుందని, పౌరులంతా సామాజిక బాధ్యతగా భూతాపాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ధరిత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు, ఇతర అన్ని రంగాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. థర్మల్ విద్యుత్‌తో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందని.. సౌర, గాలి, హైడ్రో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ విషయంలో ఎప్పటికప్పుడు వాతావరణ నిపుణుల సూచ నలు తీసుకుంటామని తెలిపారు. క్లీన్ ఎనర్జీవైపు ప్రయాణించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువులు, కుంటలతోపాటు పర్యావరణాన్ని రక్షించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయని, కొన్నిసార్లు అంచనాలకు కూడా అందడంలేదని తెలిపారు.
వాతావరణ మా ర్పులకు అనుగుణంగా పంటల మార్పిడి కూడా జరిగిందని, భూమిని రక్షించాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. మేధావులు, పర్యావరణవేత్తలు కలిసి పర్యావరణ పరిరక్షణ, క్లీన్ ఎనర్జీ కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రొ. పురుషోత్తంరెడ్డి, సామాజిక కార్యకర్త నర్సింహారెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, రిచాగుప్తా తదితరులు పాల్గొన్నారు.






