11 August, 2026 | 6:51 AM

భోజనం అప్రియం!

26-05-2024 12:46 AM

ఇదీ రాజధానిలో భోజనప్రియుల పరిస్థితి

ఆహారపదార్థాల్లో పెరుగుతున్న కల్తీ

తనిఖీల్లో అసలు ‘రంగు’ బట్టబయలు

40 రోజుల్లో 24 కేసులు నమోదు

హోటల్స్, రెస్టారెంట్లలో సర్వం కల్తీ

నాసిరకం సరుకులతో వంటకాలు

హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాలకే కాదు. నోరూరించే వంటకాలకూ ప్రసిద్ధే. హైదరాబాదీ బిర్యానీ మరీ ఫేమస్. నగర ప్రజలతోపాటు సందర్శకులు రాజధాని రుచులకు ఎగబడతారు. రకరకాల వంటకాలు తినేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో మహానగరంలో హోటళ్లు, రెస్టారెంట్లకు కొదువే లేదు. గిరాకీపై యజమానులకు బెంగ కూడా లేదు. కానీ, రుచికరమని అనుకుంటున్న ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడినట్లు స్పష్టమవుతోంది.

హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి) : ఇటీవల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి రావడం విస్మయానికి గురిచేస్తోంది. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో  నెలల తరబడి నిల్వ ఉన్న ఆహార పదార్థాలు వడ్డిస్తున్నట్లు  తెలుస్తోంది. నిల్వ చేసిన చికెన్, మటన్‌కు రంగులు పూసి సరఫరా చేస్తున్నట్లు తనిఖీల్లో బట్టబయలైందని అధికారు లు పేర్కొంటున్నారు. 

కంపుకొడుతున్న నాన్‌వెజ్ 

నాన్‌వెజ్ వంటకాల్లో ఎక్కువ శాతం అపరిశుభ్రమైన వాతావరణం నెలకొన్నట్లు తెలు స్తోంది. అన్‌సేఫ్, నాసిరకం, మిస్‌బ్రాండెడ్ కేటగిరీల్లో చేపట్టిన తనిఖీల్లో నెలల తరబడి ఫ్రిజ్‌లో నిల్వచేసిన మాంసాహారంతో వంటకాలు చేస్తున్నట్లు  అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.  వెజ్, నాన్‌వెజ్ ముడి పదార్థాలను సైతం ఒకే ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం వల్ల ఫ్రిజ్‌లు కంపు వాసనను పసిగట్టినట్లు తెలుస్తోంది. దాచిపెట్టిన మాంసాహారం వంటకా లు ఫ్రెష్‌గా ఉండేలా వినియోగించిన ప్రతీసా రీ రసాయనాలతో కూడిన రంగులు చల్లుతున్నట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం.

కొన్ని చోట్ల కుళ్లిన మాంసంతో బిర్యానీ, మరికొన్ని చోట్ల గడువు ముగిసిన మసాలాలు, ఇతరత్రా సరుకులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిసరాల పరిశుభ్రతా పాటించడం లేదని తేలింది. వంటగదుల్లో బొద్దింకలను గుర్తించారు. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో వంటగదులు దుర్వాసనతో నిండినట్లు తెలుస్తోంది. 

40 రోజుల్లో 24 కేసులు..

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలు నగరంలో  ముమ్మ రంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోం ది. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటివరకు 120 హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేపట్టగా 40 హోటళ్లకు నోటీసులు అందజేశారు. వాటిలో 24 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. మరో 15 కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

కాగా, సోమాజిగూడలో కృతుం గ, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్, కేఎఫ్‌సీ, జూబ్లీహిల్స్‌లో బాబీలోన్ బార్ అండ్ కిచెన్, గౌరంగ్ కిచెన్, పంజాగుట్టలో షాన్‌బాగ్ హోటల్ డిలక్స్, చట్నీ స్ రెస్టారెంట్, బేగంపేటలో ఐటీసీ కాకతీయ, మారిగోల్డ్, జీవీకే వన్‌లోని సిజ్జిలింగ్ జా య్, మొజంజాహీ మార్కెట్‌లో కరాచీ బేకరీల్లో ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది.  మాదాపూర్‌లోని బిగ్‌బాస్కెట్ గోదాంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటంతో సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. నాంపల్లిలోని ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట దాదాపు 297 కేసులు విచారణలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. 

లోపల మురికికూపాలు

ఎంతో పేరు మోసిన హోటళ్లలోనూ నాణ్యత లేని ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారు. తళుకుబెళుకులతో, ఆకట్టుకునే విధంగా బ్రాండింగ్‌తో వినియోగదారు లను ఆకర్షిస్తూ నాసిరకం వంటకాలు వడ్డిస్తున్నారు.  చూసేందుకు ఆకట్టుకునేలా అక్కడి పరిసరాలు ఉంటున్నా... వంటశాలలు మాత్రం చెత్త కుప్పల్లా ఉంటున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 

వామ్మో హోటళ్లు...

* శనివారం నాడు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లో గల లెబనీస్ బైట్స్,  చిచ్చాస్ అస్లీ ఖానా హోటళ్లలో నిషేధిత ఫుడ్ కలర్స్‌ను గుర్తించారు.  

* కొండాపూర్‌లో ఉన్న బిగ్ బాస్కెట్ వేర్ హౌస్‌లోనూ గడువు తీరిన ఆహార దినుసులను గుర్తించారు.  

* మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో గడువు తీరిన 100 కేజీల మినపపప్పు, పెరుగు, పాలను గుర్తించి సీజ్ చేశారు.  

* ఈ నెల 23న బాహుబలి ఖానా అనే హోటల్‌లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో పాటు కిచెన్‌లో పెద్ద ఎత్తున బొద్దింకలను గుర్తించారు.  

నాణ్యతపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్.. 

ఈ నెల 23న ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు మాదాపూర్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని, గడువు తీరిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఈ మేరకు ఆ వివరాలతో వారు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి అనేక మంది స్పందించారు. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించి అధికారులకు ఓ ప్రశ్న వేశారు. సర్... మరి ఎక్కడ తినమంటారు...? ఇంట్లోనా...? అంటే హోటళ్లలో ఇంత భయంకరంగా ఉంటే అక్కడ ఎలా తినాలి అని ఆయన అధికారులను ప్రశ్నించారు.

కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోయినా పలువురు నెటిజన్లు మాత్రం వివిధ రకాల సమాధానాలు ఇచ్చారు. ఇక తాము హోటళ్లలో తినబోమని కొందరు అంటే, ప్రభుత్వం ఈ అంశంలో కఠిన చర్యలు తీసుకునాలని మరికొందరు డిమాండ్ చేశారు. బయట భోజనం చేయాలంటేనే భయపడి పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు... ఇదీ కాస్త నగరంలో తెగ వైరల్‌గా మారింది. 

రోజుకు 40 ఫిర్యాదులు 

గతంలో ఆహార కల్తీపై చాలా తక్కు వ ఫిర్యాదులు వచ్చేవి. ఈ మధ్య కాలం లో ఎక్కువయ్యాయి. రోజుకు దాదాపు 40 వరకు ఫిర్యాదులు అందుతున్నా యి. ఆహార కల్తీపై జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూం 040 1111 నంబర్, లేదా జీహెచ్‌ఎంసీ కమిషనర్, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేయొచ్చు. నాణ్యత, శుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 

 బాలాజీరాజు, 

సిటీ ఫుడ్ కంట్రోలర్ 

హోటళ్లలో తినాలంటే భయమేస్తోంది

 ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడులను చూసి సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడంలేదు. అంతా కల్తీమయంగా ఉన్న హోటళ్లలోనా మేం ఇన్నాళ్లు ఆహారం తిన్నది అనే నిజం భయం కలిగిస్తోంది. వారమంతా మా పనుల్లో బిజీగా ఉండి వారాంతాల్లో కుటుంబంతో కలిసి మంచి రెస్టారెంట్లో భోజనం చేసి ఓ సినిమా చూసి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు హోటళ్లలో ఏమాత్రం నాణ్యత లేని ఆహారం మాకు అంటగడుతున్నారని తెలిసింది.

దీంతో మరోసారి అటు వైపు వెళ్లేందుకు భయం వేస్తోంది. మన దేశంలో ఏం చేసినా నడుస్తోందనే భావనే హోటల్ నిర్వాహకులకు భయం లేకుండా చేస్తోంది. విదేశాల మాదిరిగా కఠినమైన ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తెస్తే తప్ప పరిస్థితి మారేలా లేదు. హైదరాబాద్ పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా హోటళ్లలో తినేవారి సంఖ్య తగ్గుతుందని మాత్రం చెప్పగలను. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకుంటే ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది.

కే శ్రీనివాస్, వ్యాపారి

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆహారం అందేలా చేస్తాం...

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల, ఇతర ఫుడ్ కోర్టుల్లో ప్రజలు కల్తీలేని ఆహారం అందేలా చేయడం మా కర్తవ్యం. 

 దామోదర రాజనర్సింహ

ఆరోగ్య శాఖ మంత్రి