31-12-2025 12:17:21 PM
వాహనాలను సిజ్ చేసిన పట్టణ సీఐ శివశంకర్
కోదాడ,(విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలు భద్రపరచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31 ఫస్ట్ నేపథ్యంలో మంగళవారం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టణవ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుని సుమారు 100 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
నూతన సంవత్సర వేడుకల వేళ యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు సహకరించాలని సీఐ శివశంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హనుమాన్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఏఎస్ఐలు షేక్ ఖయ్యూం, శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.