calender_icon.png 4 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కల సాకారానికి సీఐటీయూ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

04-09-2025 04:53:58 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సొంతింటి కల సాకారానికి సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో చేపట్టనున్న వినూత్న కార్యక్రమాలలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ నాగరాజు గోపాల్, బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ లు కోరారు. ఏరియాలోని కాసిపేట 2 గనిపై గురువారం నిర్వహించిన సమావేశంలో సింగరేణి సంస్థ గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలలో కార్మికుల లాభాల వాటాపై ప్రకటన చేయాలని, కార్మికుల మారుపేర్లను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న జిఎం కార్యాలయాల ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు.

సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కోసం ఈనెల 11, 12 తేదీలలో గనులు డిపార్ట్ మెంట్ల వారిగా ఓటింగ్ నిర్వహించి కార్మికుల అభిప్రాయాన్ని తెలుసుకొని కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ నెరవేరుస్తామని సింగరేణి ఎన్నికల్లో అన్ని యూనియన్లు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కార్మికుల సొంతింటి కళపై అసెంబ్లీలో మాట్లాడకుండా దాటవేస్తున్న కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేల తీరు సరికాదనీ వారు మండిపడ్డారు. సింగరేణి లో గుర్తింపు సంఘం సొంతింటి కళ పై కమిటీ వేసిందని చెబుతూనే ప్రభుత్వం చేతిలో ఉందని రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని వారు విమర్శించారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు సొంతింటి కళ నెరవేర్చడం వలన క్వార్టర్ల పై ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని, ప్రభుత్వానికి పన్నులు కట్టడం తప్పుతుందని, 2011 లో అగ్రిమెంట్ చేసుకుని అధికారులకు అమలు చేస్తున్న అలవెన్స్ లపై ఐటి మాఫీ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉండదని, వీటివలన యాజమాన్యానికి ఆర్థికంగా లబ్ధి జరుగుతుందన్నారు.

సొంతింటి కళ పై కార్మికులకు అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తున్న తమ యూనియన్ తీరును జీర్ణించుకోలేని రియాజ్ అహ్మద్ లాంటి నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తప్ప ఎలాంటి పోరాటం చేయకుండా మీకు యాజమాన్యం చెవిలో చెప్పిందా అని అడగడం చూస్తుంటే యాజమాన్యాలు చెవిలో చెప్తేనే కార్మిక సంఘాలు అడుగుతాయా అనేది తెలుసుకోవాలని వారు హితవు పలికారు. సొంతింటి కళకై చేస్తున్న పోరాటంలో గని సీనియర్ కార్మికుడు డి గోపాలకృష్ణ యూనియన్ లో చేరగా ఆయనను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ బుద్ధ సురేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, షిఫ్ట్ ఇంచార్జ్ నామని సురేష్, ఆర్గనైజర్ విద్యాసాగర్, టెక్నికల్ ఇన్చార్జి నవీన్, రాజ్ కుమార్, ప్రశాంత్, మనోజ్, జాకీర్,సాయికుమార్,రమేష్, నవీన్, సూరజ్, శ్రీశైలం, రాజేష్, హరీష్, సంపత్, మనోజ్ లు పాల్గొన్నారు.