04-09-2025 07:23:06 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తుల విస్తృత ప్రయోజనార్థం రూపొందించిన వనపర్తి హెల్త్ యాప్ ను రోగులతో పాటు వైద్యులు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం కలెక్టర్ వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదు అయి ఉన్న మధుమేహం, క్షయ వ్యాధి గ్రస్తుల వివరాలు వనపర్తి హెల్త్ యాప్ లో తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరి వివరాలు సరిగ్గా నమోదు చేయాలని, వారి మొబైల్ నెంబరు, వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి తిరిగి తనిఖీ చేయించాలని ఆదేశించారు. అన్ని వివరాలు సరిగ్గా ఉండాలని, మధ్యలో వారు తీసుకున్న వైద్య చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ యాప్ లో లెప్రసి వ్యాధిగ్రస్తుల వివరాలు, హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల వివరాలు సైతం అప్లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యాప్ లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ గుర్తింపు కార్డు ఉండే విధంగా వివరాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వనపర్తి హెల్త్ యాప్ లో ఇదే విధమైన వివరాలు నమోదు చేసేవిధంగా చూడాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. అనంతరం పి.హెచ్.సి లో వైద్యం పొందుతున్న బాలింతలతో కలెక్టర్ మాట్లాడారు. వైద్య సేవలు ఎలా వున్నాయి ఇక్కడ? కనీస మౌలిక సదుపాయాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సి. లో మంచి వైద్య సేవలు ఉన్నాయని ఇబ్బందులు లేవని రోగులు సమాధానం ఇచ్చారు. ఆసుపత్రికి అవసరమైన మరమ్మతులు ఏమైనా ఉంటే ప్రతిపాదనలు ఇవ్వాలని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని వైద్య అధికారిని సూచించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ పరిమళ, వనపర్తి మండల తహసిల్దార్ రమేష్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.