04-09-2025 07:38:45 PM
రూ.12 కోట్లతో గుడి నిర్మాణం..
రూ.75 కోట్లతో రవాణా సౌకర్యం..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
రేగొండ (విజయక్రాంతి): మండలంలోని కోటంచ గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పునః నిర్మాణాన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలిసి కోటంచలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కోటంచ బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సమీక్ష సమావేశంలో ఆలయ గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూ లైన్లు, విమాన గోపురం, అర్థ మండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూ జరిపారు. మరో నాలుగు నెలల్లో అన్ని పనులు పూర్తయి ఆలయ పున ప్రారంభం కావాలని ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కోటంచ ఆలయ అభివృద్ధి వెనుకంజలో ఉందని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇందులో ప్రధానంగా విమాన గోపురం, అర్థ మండపం, మహా మండపం పునర్నిర్మాణానికి 3.77 కోట్లు కేటాయించినట్లు, అద్దాల మండపం రూ.5 లక్షలు, అల్వార్ నిలయానికి రూ.1.10 లక్షలు,పాకశాల భవనానికి రూ.7.5 లక్షలు, క్యూలైన్ల నిర్మాణానికి రూ.30 లక్షలు,అన్నదాన సత్రానికి రూ.40 లక్షలు, ఆలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి రూ.15 లక్షలు, భక్తుల బస కోసం రూ.5.5 లక్షలు, కంపౌండ్ వాల్ రూ.50 లక్షలు, తాగునీటి ట్యాంక్ రూ.30 లక్షలు,ఈవో,ఇతర అధికారుల ఆఫిస్ కోసం రూ.50 లక్షలు, అర్చకులు,వసతి గృహాలకు రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే గణపురం మండలం బుద్ధారం గ్రామం నుండి కొడవటంచ గ్రామం వరకు రూ.75 కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.ఈ పనుల నిర్మాణాలు గత పది నెలల క్రితమే ప్రారంభించిన మరో నాలుగు నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. త్వరలోనే రేగొండ పోలీస్ స్టేషన్ వద్ద అసంపూర్తిగా ఉన్న ఆర్చి ని పనులు పూర్తిచేసి త్వరలోనే ఆర్చి ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి, ఆలయ ఈవో ఎస్.మహేష్, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ,నాయకులు సంపత్ రావు,ఎర్రబెల్లి రవీందర్ రావు, పున్నం రవి,ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరుల పాల్గొన్నారు.