రిపోర్టర్ పై దాడిని నిరసిస్తూ జర్నలిస్టుల ర్యాలీ, ధర్నా రాస్తారోకో
కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేత
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ పుల్ల రవీందర్(రవితేజ)పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దాడిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా, రాస్తారోఖో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ రవీందర్ ఇంట్లోకి వెళ్లి కులం పేరుతో దుషిస్తూ దాడికి పాల్పడి, ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుతో పాటు, అత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరగా ఎస్పీ సానుకూలంగా స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు విచారణలో వేరే వాళ్లు ఉన్నట్లు తెలితే వారి పేర్లు కూడా చేరుస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్ట్ యూనియన్ సంఘాల నాయకులు, కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు, వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.






