24 May, 2026 | 7:40 PM

సీసీఎస్ ప్రక్షాళన

17-06-2024 12:27 AM
  • 12 మంది ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్-2 కు బదిలీ
  • ఉత్తర్వులు జారీచేసిన హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి) : సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్ బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు తామున్నామనే భరోసా కల్పించే పోలీసు అధికారులే ఇటీవల అవినీతి, అక్రమార్కులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాలు సరిపోవడం లేదేమో? కోట్లు కూడబెట్టాలనే ఆలోచనతో లంచగొండి అవతారమెత్తి ప్రజలను లంచాల పేరిట పీడించుకుతింటున్నారు.

ఎన్నో సంచలన కేసులను ఛేదించిన నగర సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) ప్రస్తుతం వివాదాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న సీసీఎస్‌లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం సీసీఎస్ కార్యాలయం ఎదురుగానే ఈఓడబ్ల్యూ టీమ్ ఇన్‌స్పెక్టర్ చామకూర సుధాకర్ రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  దీంతో సీసీఎస్ ప్రతిష్ఠ దెబ్బతినక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం అమలులో ఉన్న న్యాయ చట్టాల ప్రకారం సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కేవలం క్రిమి నల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం సీసీఎస్ అధికారులకు కలిసి బాగా కలిసి వస్తోందని పలువురు న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. నగరంలో జరిగే సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కామ్‌లను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. నగరంలోని ఇతర పోలీస్‌స్టేషన్లలో నమోదైన వాటిని కూడా సీటీ పోలీస్ కమిషనర్ దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేస్తుంటారు. దీంతో సీసీఎస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని, త్వరలోనే ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ బదిలీలు తప్పవని తెలుస్తోంది.