నెలాఖరులోగా గనులను వేలం వేయాలి
- ఆ ఆరు గనులను విక్రయించాల్సిందే
లేకుంటే.. కేంద్రం ఆధ్వర్యంలో బ్లాక్‌లను విక్రయిస్తాం
రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన కేంద్ర గనుల శాఖ
హైదరాబాద్, జూన్16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా ఒక్క మినరల్ బ్లాకును కూడా వేలం వేయకలేకపోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆరు గనులను వేలం ద్వారా విక్రయించాలని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గనుల శాఖ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది.
తెలంగాణలో వేలం పాట కోసం 11 బ్లాకుల జియాలాజికల్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమర్పించినట్లు గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఐదు ఇనుప ఖనిజ గనులు, ఐదు సున్నపురాయి బ్లాక్‌లు, ఒకటి మాంగనీస్ బ్లాక్ ఉన్నాయి. అయితే ఈ గనుల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదేళ్లుగా ఒక్క బ్లాక్‌ను కూడా వేలం ద్వారా విక్రయించలేదని కేంద్ర మైనింగ్ శాఖ చెబుతోంది.
కేంద్రమే వేలం నిర్వహిస్తుంది
వేలం ద్వారా గనుల కేటాయింపు 2015లో ప్రారంభమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా రాసిన లేఖలో కేంద్రం కీలక సూచనలు చేసింది. 11బ్లాకుల్లో జూన్ 30నాటికి కనీసం ఆరు బ్లాకులకు వేలం వేయకుంటే.. కేంద్రమే రంగంలోకి దిగుతుందని గనుల శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తామని హెచ్చరించింది.
2021లో కేంద్రం మైనింగ్‌లో కొన్ని సవరణలను తీసుకొచ్చింది. కొత్త సవరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం అంగీకారం మేరకు గనులను వేలం వేయడంలో విఫలమైతే.. ఆ బ్లాక్‌ను విక్రయించే హక్కు కేంద్రానికి ఉంటుంది. 2015 నుంచి దేశంలో ఇప్పటివరకు 354 బ్లాక్‌లను వేలం ద్వారా విక్రయించారు. వాటిలో 45 గనుల్లో ఉత్పత్తి సైతం ప్రారంభమైంది. ఫలితంగా గనులను విక్రయించిన రాష్ట్రాల్లోనూ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.






