మతపెద్దల మంజూరీ చెల్లదు
- అస్సాంలో ముస్లిం వివాహాలకు కొత్త చట్టం
- 1935 నాటి చట్టాన్ని రద్దు చేసిన సర్కారు
- బిల్లును అసెంబ్లీలో పెట్టిన హిమంత ప్రభుత్వం
- ఇకపై ముస్లిం వివాహాలకూ రిజిస్ట్రేషన్
గువాహటి, ఆగస్టు 23: అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ముస్లిం మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ రద్దుచేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ గురువారమే ఆమోదం తెలిపింది. బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ముస్లిం వివాహాలు కూడా ఇతర మతాల వివాహాలలాగే ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మత పెద్దల పెత్తనానికి చెక్
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మతంలోని అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకొంటే దానిని ఖాజీలు కానీ ఇతర అధికారిక మతపెద్దలు కానీ ఆమోదించాల్సి ఉంటుంది. 1935లో తెచ్చిన ముస్లిం మ్యారేజెస్, డైవోర్స్ చట్టం ప్రకారం ముస్లిం వివాహాలకైనా, విడాకులకైనా ఆ మత పెద్దల తీర్పే ఫైనల్. దీనిని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా మార్చేయబోతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలుచేయటమే లక్ష్యంగా కొత్త బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం ముస్లిం వివాహాలను కూడా కచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ‘18 ఏండ్లు నిండని ఏ బాలికకు కూడా బలవంతంగా వివాహం చేయకుండా మేం కొత్త బిల్లును తెచ్చాం. దీని ద్వారా వివాహాలను రిజిస్టర్ చేసే అధికారాన్ని ఖాజీల నుంచి సబ్ రిజిస్ట్రార్‌కు బదిలీ చేస్తున్నాం. భిన్న మతాలవారికి భిన్నమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. మేం వాటిలో జోక్యం చేసుకోవటంలేదు. వివాహాల రిజిస్ట్రేషన్ విధానం మాత్రమే మారుస్తున్నాం. మిగతా అన్నీ యథావిధిగా కొనసాగించుకోవచ్చు’ అని అస్సాం సీఎం హిమంత తెలిపారు.






