22 April, 2026 | 5:25 PM

శాంతివైపే భారత్

24-08-2024 12:00 AM

తటస్థంగా ఎప్పడూ ఉండదు

శాంతికోసం మధ్యవర్తిత్వానికి సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటన

ఉక్రెయిన్‌లో అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ

కీవ్, ఆగస్టు 23: అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి విషయంలోనూ భారత్ తటస్థంగా ఉండదని, ఎప్పటికైనా శాంతివైపే నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. యుద్ధక్షేత్రంలో సమస్యలు పరిష్కారం కావని.. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతి సాధ్యమని పునరుద్ఘాటించారు. పోలండ్ పర్యటన ముగించుకొని మోదీ శుక్రవారం ఉక్రెయిన్ చేరుకొన్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న మొదటి ప్రధాని మోదీనే. నెల క్రితమే మోదీ రష్యాలో కూడా పర్యటించారు.

రైలులో ప్రయాణించి కీవ్‌కు చేరుకొన్న మోదీకి వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులు ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. ఇద్దరు నేతలు కలిసి యుద్ధంలో మరణించి చిన్నారులకు గుర్తుగా నిర్మించిన స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం మోదీ జెలెన్‌స్కీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యవసాయం, ఔషధాలు, సంస్కృతి, మానవతా సాయం పై నాలుగు ఒప్పందాలు కుదిరాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. 

మధ్యవర్తిత్వానికి సిద్ధం

సుదీర్ఘంగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వేలమంది చిన్నారులు చనిపోవటంపై మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ధంలో చిన్నారుల మృతిని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టంచేశారు. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ద్వైపాక్షిక చర్చల వివరాలను వెల్లడించిన జైశంకర్.. ప్రధానంగా యుద్ధం గురించే చర్చ జరిగిందని చెప్పారు.

‘శాంతిని నెలకొల్పేందుకు సంబంధిత వర్గాలన్నింటితో వాస్తవిక దృక్పథంతో చర్చలు జరుపాలని భారత ప్రధాని సూచించారు’ అని వెల్లడించారు. భారత్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాల పునరుద్ధరణకు అంతర ప్రభుత్వ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీ కూడా భారత్‌ను సందర్శించే అవకాశం ఉన్నదని జైశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను మోదీ భారత్ ప్రత్యేకంగా రూపొందించిన భీష్మ్ వైద్య కిట్లను అందించారు. 

జెలెన్‌స్కీ భుజంపై మోదీ చెయ్యి

ఏ దేశంలోనైనా మరో దేశాధినేత పర్యటిస్తే పాటించే ప్రొటోకాల్, స్వాగత సత్కారాలు ముందుగానే నిర్ణయమవుతాయి. సాధారణంగా రెండు దేశాల నేతలు షేక్ హ్యాండ్స్ లేదంటే భారత విధానంలో దండం పెటుకోవటం చూస్తుంటాం. కానీ, మోదీ ఉక్రెయిన్ పర్యటనలో అంతకుమించి కనిపించింది. మోదీకి జెలెన్‌స్కీ స్వాగతం పలుకగానే ఇద్దరు ముందుగా షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకొన్నారు.

ఆ వెంటనే మోదీ మార్క్ అయిన ‘ఆత్మీయ ఆలింగనం’ కూడా కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు యుద్ధంలో మరణించిన చిన్నారుల స్మారకం వద్దకు వెళ్లారు. అక్కడికి జెలెన్‌స్కీ భుజంపై మోదీ చేయి వేసి నడుచుకొంటూ వెళ్లారు. ఈ దృశ్యం జెలెన్‌స్కీని మోదీ ఓదారుస్తున్నట్టు కనిపించింది. కీవ్‌లోని ఓయాసిస్ ఆఫ్ పీస్ పార్కులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మోదీ నివాళులు అర్పించారు.