బడులను మూసివేసే ఆలోచనలను విరమించుకోవాలి
బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్
ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే ఆలోచనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వినర్ జి. వేణుగోపాల్, కార్యదర్శి సీహెచ్.లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, బోధనా సిబ్బంది కొరత ఉన్న పాఠశాలల్లో తక్షణమే అన్ని వసతులను కల్పించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన అన్ని డివిజన్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసిన విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు అన్నారు. అలాగే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసుల అమలుకు ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వేదిక నేతలు వెంకటేష్, బాలయ్య, రమాదేవి, నాగరాజు పాల్గొన్నారు.






