సీఎస్‌ఆర్ నిధులపై సీఎం ఫోకస్
సమీకరణకు ప్రత్యేక పాలసీ
రాష్ట్రస్థాయిలో సెల్ ఏర్పాటు చేయాలి
ఇక్కడున్న కంపెనీలు వేరే చోట ఖర్చు పెడితే ఎలా?
రాష్ట్రానికి మరిన్ని ఫండ్స్ రావాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్ నిధుల విరాళాలతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు.
ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం పంచుకున్న సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన ఉత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాసన మండలి కాన్ప్‌రెన్స్ హాల్‌లో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ఆర్ ఫండ్స్‌పై గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు సీఎస్‌ఆర్ తో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుందన్నారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా తెలంగాణ సీఎస్‌ఆర్ పోర్టల్ ను ఆకర్షణీయంగా రూపొందించాలని సీఎం ఆదేశించారు.
కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్ లో పొందుపరచాలన్నారు. జాతీయ స్థాయిలో సీఎస్‌ఆర్ విరాళాల వాటా మన రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. ఇప్పటి వరకు వచ్చిన సీఎస్‌ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్‌ఆర్ ఫండ్స్ వేరే చోట ఖర్చు పెడితే ఎలా? అని సీఎం అన్నారు. రాష్ట్రానికి మరిన్ని సీఎస్‌ఆర్ ఫండ్స్ రావాల్సిన అవసరం ఉందని, మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్‌ఆర్ ఖర్చు పెట్టేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో సీఎస్‌ఆర్ సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.
సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచిఘోష్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్, యోగితారాణా, శశాంక, భవేష్ మిశ్రా, నిఖిల్ చక్రవర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.




