ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సర్వే హెలికాప్టర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన నీటిపారుదల రంగానికి సంబంధించిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) సొరంగం పనులను పునరుద్ధరించేందుకు జరుగుతున్న హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా సర్వే నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించామన్నారు. టన్నెల్ ను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు 1983లో మంజూరైందని సీఎం గుర్తు చేశారు.
అప్పుడు మంజూరైన ప్రాజెక్టు ఇప్పటికి పూర్తికాకపోవటం బాధాకరమని, ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ.1968 కోట్లు అన్నారు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేయలేదని, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుల్లో పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని సీఎం ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును విస్తారిస్తుంటే కేసీఆర్ మాత్రం చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు.
కానీ, ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే పట్టించుకోలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాకు నీరు అందేదని, కృష్ణానది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు చెల్లించిందని, ఈ రూ.1.86 లక్షల కోట్లలో రూ.1.06 లక్షల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించారని చెప్పారు.
గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ బోర్ మిషన్ తో మిగతా పనులు చేయటం కష్టంగా మారిందని, ఇకపై టన్నెల్ పనులపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయటం తగదని హెచ్చరించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేసి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆర్మీలో నిపుణులైన అధికారులను డిప్యుటేషన్ పై తీసుకువచ్చామని సీఎ రేవంత్ రెడ్డి తెలిపారు.




