సమగ్ర కులగణనపై సీఎం రేవంత్ కుట్ర
- జూలై 15న బీసీల ‘చలో సెక్రటేరియట్ ’
- బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి: సమగ్ర కులగణన, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, లేదంటే జూలై 15న సెక్రటేరియట్ ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం రాజారాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం బీసీలను మోసగించడమేనని, నెహ్రూ కాలేల్కర్ కమిషన్‌ను అడ్డుకుంటే, ఇందిరాగాంధీ మండల్ కమిషన్ రిపోర్టును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారని గుర్తు చేశారు.
దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిన రాహూల్ గాంధీ మాటలకు రేవంత్ రెడ్డి విలువ ఇవ్వరా అని నిలదీశారు. రిజర్వేషన్లకు కేసుల ముసుగు వేసి దొడ్డిదారిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని రేవంత్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అదే జరిగితే బీసీ కులాల సంఘాలు సంఘటితమై జూలై 15న సెక్రటేరియట్‌ను ముట్టడిసామని హెచ్చరించారు. బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయిస్తామని అనడం బీసీలను మభ్యపెట్టడమే అని అన్నారు.
ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన కాంగ్రెస్‌కు ఏ మాత్రం లేదన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శారద, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ, అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు గోవర్థన్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు నిమ్మల వీరన్న, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధికారి ప్రతినిధి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






