25 July, 2026 | 4:43 PM

కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్

27-06-2024 01:16 PM

బీఆర్ఎస్, బీజేపీ రంకెలేశాయి

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారు

ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆర్

న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గురువారం ఆరోపించారుమీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదన్నారు. రాష్ట్రవతరణ దినోత్సవాలకు కేసీఆర్ ను ఆహ్వానించాం.. రాష్ట్రవతరణ దినోత్సంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని చెప్పారు.  పార్టీ ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆర్ అని రేవంత్ ఆరోపించారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  కేసీఆర్ లాక్కున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సీఎం పేర్కొన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. కేటీఆర్, హరీశ్ మాటలకు అప్పట్లో బీజేపీ వంతపాడిందని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్, బీజేపీ రంకెలేశాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూలగొడతామంటుంటే తాము గాలికి వదిలేయాలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆయన స్పందిస్తూ.. రైతు రుణమాఫీతోపాటు ఆరు హామీల అమలుకు ఆకర్షితులై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పార్టీలో చేరారన్నారు.