02-07-2025 12:49:25 PM
విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత: సీఎం రేవంత్
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills)లో ఏఐజీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మొత్తం నాలుగు కరోనా టీకాల్లో మూడు మనమే అందిస్తున్నామని తెలిపారు. జినోం వ్యాలీ హైదరాబాద్ కు చాలా కీలకమన్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి(Dr. D. Nageshwar Reddy) భారతరత్న వచ్చేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఐడీపీఎల్ మాజీ ఉద్యోగుల కృషి వల్లే ఫార్మా రంగం అభివృద్ధి చెందిందన్నారు. ఏఐజీ ఆస్పత్రి సేవలు ఇంకా విస్తరించాలని సీఎం కోరారు. హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్ రెడ్డిని కోరామని సీఎం తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయుడు(Nori Dattatreyudu) సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మహిళల ఆరోగ్య వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ వల్ల మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. జనని మిత్ర యాప్ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీ ద్వారా మన నగరం గొప్పతనం చాటిచెప్పామని తెలిపారు. మిస్ వరల్డ్ అభ్యర్థులకు ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital) చూపించాలని నేనే చెప్పా అన్నారు. రాష్ట్ర పర్యాటక స్థలాలను మిస్ వరల్డ్ పోటీ దారులకు చూపించామని గుర్తుచేశారు. నిమ్స్ లో అదనపు బ్లాక్, ఎల్ బీనగర్, సనత్ నగర్ లో ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని సూచించారు. రాష్ట్రంలోని వైద్యులందరికీ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో ఒక్క నెల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరుతున్నాని చెప్పారు. మీకు ఇష్టం వచ్చిన ఆస్పత్రిని ఎంచుకుని నెలపాటు పనిచేయాలని సూచించారు. నిమ్స్, ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందన్నారు. మధ్యప్రాచ్య దేశాల నుంచి నేరుగా రోగులు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ కు నేరుగా విమానాలు వచ్చేలా చూస్తామన్నారు.