సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి!
- ధాన్యం మొత్తం కొంటానని కేంద్రం అగ్రిమెంట్ చేసిందా?
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 3 (విజయకక్రాంతి): రేవంత్‌కి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని, ప్రతి గింజ కొనకుంటే ఆ ధాన్యాన్ని మీ ఇంటి ముందు పోయాలా? గాంధీ భవన్ ముందు పోయాలా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం డబ్బులతో ఇల్లు కట్టి ఇందిరమ్మ అని పేరు పెట్టేందుకు సిగ్గుందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవి మోదీ కట్టిస్తున్న ఇల్లు అని చెప్పే మొహం ఉందా? అని విమర్శించారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు రావాలని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.
ప్రతి గింజ కొంటానని మాట్లాడింది సీఎం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్రం కొనుగోలు చేసే వడ్లలో 60 శాతం తెలంగాణ నుంచే కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని, అవసరమైతే రైతుల ధాన్యం తీసుకువచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముందు పోస్తామంటూ హెచ్చరించారు. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటా యించిన రూ. 7,000 కోట్లలో రూ. 4,644 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులేనని తెలిపారు.






