కొంతమేరకైనా ధ్యానంగా ఉంటా
హైదరాబాద్: బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహేంద్రహిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ధ్యానం ఒక పనిగా కాదు.. ప్రతి పనిని ధ్యానంగా చేయాలని సీఎం తెలిపారు. చదివితే రెండు లైన్లు మాదిరిగా ఉంది.. అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానమంతా అందులోనే ఉందన్నారు. పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంతమేరకైనా ధ్యానంగా ఉంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాబోధి బుద్ధవిహార్ కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు.
ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామననారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచన ఇతరులకు పంచాలని సీఎం కోరారు. గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందిరికీ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






