29-07-2024 04:51:15 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కోనసాడుతుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ కలిసి ముఖ్యమంత్రి తరపున సభలో పద్దులను ప్రవేశపెట్టారు. విద్యుత్ అంశంపై శాసనసభలో వాడీవేడిగా చర్చ సాగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్టాడుతున్నారని, కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపంలా జగదీష్ రెడ్డి చెప్పున్నారని సీఎం మండిపడ్డారు. విద్యుత్ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులు అని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుపై యాదాద్రి పవర్ ప్లాంట్ పై, న్యాయ విచారణ జరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వచ్చేదన్నారు. విద్యుత్ పై న్యాయ విచారణ కోరింది వాళ్లే... వద్దంటున్నది వాళ్లే అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రంలోగా విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమించాలని కోరగా, కమిషన్ కొత్త ఛైర్మన్ ను సాయంత్రం నియమిస్తామని సీఎం పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నామని, విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్ కు ఆదాయం పెరిగిందన్నారు. వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్ రెడ్డి చేశారని, ఆయన కృషి వల్లే తెలంగాణకు 54 శాతం విద్యుత్ వచ్చిందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో రాష్ట్రానికి 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు.
తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోనియా గాంధీ దయ, జైపాల్ రెడ్డి కృషి వల్లే రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టేక్కిందని, విద్యుత్ పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీహెచ్ఎల్ నుంచి సివిల్ వర్క్స్ అన్ని వాళ్ల బినామీలకే ఇచ్చారని, ప్రైవేట్ కాంట్రాక్టర్లు వాళ్ల పార్టీవాళ్లకు ఇచ్చిన వేల కోట్ల పనుల్లో అవినీతి జరిగిందన్నారు. విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని సీఎం తెలిపారు. విద్యుత్ కమిషన్ ఎదుట కేసీఆర్ ఎందుకు హజరుకాలేదు..? అని ప్రశ్నించారు. విద్యుత్ సివిల్ వర్క్ లో బినామీలకు టెండర్లు ఇచ్చారని, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యల కోరిక మేరకు న్యాయ విచారణకు ఆదేశించాం.. విచారణ జరుగుతున్నప్పుడే మేము దొరికిపోయాం అని వాళ్లకు అర్థమైందన్నారు.
జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని, విచారణ జరపాలని జగదీష్ రెడ్డే అడిగారని, ఇప్పుడు వాళ్లే వద్దని మాజీ సీఎం కేసీఆర్ కోర్టును వెళ్లినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ అంశంలో విచారణ జరగాల్సిందే అని కోర్టు చెప్పిందని, గురువుకు పంగనామాలు పెట్టడం ఎక్కడైనా ఉందా అని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ డీఎన్ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం అని, నమ్మిన వారిని మోసం చేసే లక్షణం బీఆర్ఎస్ దే అన్నారు. ఇవాళ సాయంత్రం కమిషన్ కొత్త ఛైర్మన్ ను నియమిస్తాం అని, మీ వాదనలు విద్యుత్ కమిషన్ ముందు చెప్పండని ముఖ్యమంత్రి చెప్పారు. కోర్టు ల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడితే ప్రాసిక్యూటర్ చేయాల్సి వస్తుందని, కమిషన్ రద్దు చేయాలనే హైకోర్టుకు వెళ్లారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు చెప్పినట్లు స్పష్టం చేశారు.
ఛైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారనే అభ్యంతరంపై కోర్టు మిమ్మల్ని అడిగితే.. ఛైర్మన్ ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు చెప్పినట్లు స్పష్టం చేశారు. కమిషన్ రద్దు చేయాలన్న వాళ్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.భద్రాద్రి పవర్ ప్లాంట్ ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకోని, ఏడేళ్లు పట్టిందన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 2021లోపు పూర్తి చేసామని ఒప్పందం చేసుకొన, మరో రెండేళ్లు పడుతుందని ఆయన తెలిపారు. మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది మీరుకాదా..? అని ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉండికూడా తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో మాట్లాడాను. నన్ను జైలుకు పంపించినా భయపడలేదు.. నిలబడి కొట్లాడాను. వాళ్ల అబద్దాలు మానకపోతే.. నేను నిజాలు చెప్పడం మానను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.