చేవెళ్లపై సీఎం ప్రత్యేక దృష్టి
వరుస కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు
తెరపైకి చేవెళ్ల సెంటిమెంట్ అస్త్రం
గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు
రంగారెడ్డి మే 3 (విజయక్రాంతి): చేవెళ్ల లోక్‌సభ స్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ గెలుపు ఆయన ప్రెస్టేజ్‌కి సవాల్‌గా మారింది. ఈ నియోజకవర్గా నికి ఆయనే స్వయంగా ఇన్‌చార్జిగా వ్యహరిస్తుండటంతో అందరి దృష్టి చేవెళ్లపై పడింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు అన్నీ ఆయన డైరెక్షన్‌లోనే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన చేవెళ్ల సెంటిమెంట్‌ను ప్రతి సభలోనూ ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం గ్రేటర్ హైదరాబాద్‌ను కలుపుకొని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉండటంతో అర్బన్, సెమీ అర్బన్ ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మళ్లేలా ఎత్తుగడలు వేస్తున్నారు. మరోవైపు పార్టీలో గ్రూప్‌లు ఏర్పడకుండా అసంతృప్త నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రంజిత్‌రెడ్డికి మద్దతు తెలిపేలా చేశారు.
కార్నర్ మీటింగ్‌లు..రోడ్ షోలు
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ సుడిగాలి ప్రచారం చేస్తూనే.. చేవెళ్లపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల ప్రచారం చేశారు. ఏప్రిల్ 25న రాజేంద్రనగర్, 30న మహేశ్వరం నియోజకవర్గం, మే 1న శేరిలింగం పల్లిలో రోడ్ షోలు, కార్న ర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని ప్రణాళిక వేశారు. ప్రచారంలో రేవంత్ ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో నూతతోత్సాహం నింపుతున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు. వీళ్లు బలమైన పోటీదారులు కావటంతో ఎలాంటి అలసత్వం లేకుండా రంజిత్‌రెడ్డి గెలుపుకోసం రేవంత్ కష్టపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రధాన వార్డులు, డివిజన్ల వద్ద రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తా నని హామీల వర్షం కురిపిస్తున్నారు.
చేరికలపై ప్రత్యేక దృష్టి
చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో నాలుగు స్థానాలు బీఆర్‌ఎస్ గెలుచుకొన్నది. వికారాబాద్‌లో మూడు స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొంది. అంటే ఇక్కడ బీఆర్‌ఎస్ పైచేయి సాధించింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పలుకుబడి ఉన్న ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకొంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు నేతలను రంగంలోకి దింపారు. వారు ఆయా నేతలను సీఎంతో మాట్లాడిస్తూ కాంగ్రెస్‌లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని పలువురు బీఆర్‌ఎస్ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మరోవైపు సంప్రదాయ ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి మండల, గ్రామస్థాయి కార్యకర్తలకు నేరుగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.




