బీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ మాయం!

08-05-2024 01:31:00 AM

వాటాలు పంచుకున్న మాజీలు?

అభ్యర్థి ప్రచారానికి డబ్బుల కొరత

కార్యక్రమాలకు కార్యకర్తలు దూరం

అయోమయంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి 

హనుమకొండ, మే 7 (విజయక్రాంతి): వరంగల్ బీఆర్‌ఎస్ పార్టీలో ఎన్నికల ఫండ్ రగడ చిచ్చురేపుతోంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఫండ్ మాయమవడం గందరగోళం సృష్టిస్తోంది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఆ ఫండ్‌ను వాటాలు పంచుకున్నట్టు సొంత పార్టీలోనే ప్రచారం జోరందుకుంది. దీంతో బూత్ కమిటీలు, మండల, గ్రామ స్థాయి కేడర్‌కు డబ్బులు అందక వారంతా తిరుగు బాటు జెండా ఎగురవేసినట్టు సమాచారం. పార్టీ ఫండ్ ఇవ్వని కారణంగా స్థానిక నేతలను బహిరంగంగానే నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫండ్ తీసుకున్న నేతలెవరూ ఆయా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో గులాబీ పార్టీ ప్రచారంలో వెనకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అభ్యర్థికి నిధుల కొరత

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బలహీనపడిన బీఆర్‌ఎస్ పార్టీకి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి పూర్వవైభవం చాటుకోవాలనే ఆశలకు సొంత పార్టీ నేతలు గండికొడుతున్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు పార్టీ ఫండ్ కింద రూ.15 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ నిధులు అందినట్టు పార్టీలో ప్రచారం నడుస్తోంది. అయితే ఆ నిధులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లతో కలిసి మాజీ మంత్రి వాటాలుగా పంచుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నిధులు పంచుకున్న నాటి నుంచి ఇన్‌చార్జ్‌గా ఉన్న నేతలెవరూ నియోజకవర్గాల్లో కనిపించడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో ద్వితీయ స్థాయి కేడర్, బూత్ కమిటీలకు నిధుల కొరత ఏర్పడటంతో సంబంధిత నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. 

దెబ్బ మీద దెబ్బ 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. మొదట్లో వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి కూతురు కావ్యను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అప్పటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కడియం శ్రీహరి కూతురుతో సహా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎవరూ ఊహించని పరిణామానికి పార్టీ అయోమయంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను ప్రకటించారు. అంతేకాకుండా రూ.15 కోట్ల పార్టీ ఫండ్ అందజేసి నట్టు సమాచారం. ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన ఆ డబ్బును ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ఇష్టానికి ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లిని ప్రశ్నించడంతో వారికి వాటాల కింద పంచి ఇచ్చి చల్లబరిచినట్టు ద్వితీయశ్రేణి నాయకులు బహిరంగం గానే చర్చించుకుంటున్నారు. గత నెల 28న కేసీఆర్ రోడ్‌షో తర్వాత ముఖ్య నేతలెవరూ కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫండ్ మాయంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పలువురు నాయకులు, కార్యకర్తలు నిలదీయ డంతో మీ మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించామని, తనకు సంబంధం లేదని, అసలు ఫండ్ రాలేదనే పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్టు తెలిసింది. 

పార్టీ శ్రేణుల ఆందోళన

ఎన్నికల ఫండ్ మాయం తర్వాత ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్ పరిస్థితి దయనీయంగా మారినట్టు సమాచారం. స్థాని కంగా చోటుచేసుకున్న పరిణామాలను పార్టీ అధినేతకు చెప్పుకోలేక, ఖర్చు చేయడానికి డబ్బులు లేక నిస్సహాయస్థితిలో పడిపోయినట్టు తెలుస్తోంది. అభ్యర్థి సుధీర్‌కుమార్‌కు మొదట్లో పార్టీ అందజేసిన రూ. 95 లక్షలకు తోడు అప్పు చేసి తెచ్చుకున్న డబ్బులతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చినట్టు సమాచారం. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న క్రమంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం అభ్యర్థికి కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ప్రచారం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో నాయకులు, కార్యకర్తలు డబ్బులు ఇవ్వనిదే ప్రచా రంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఈ కారణంగా పార్టీ కార్యకర్తలు ప్రచారంలో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం. పార్టీ ఫండ్ ఇవ్వకుంటే ప్రచారం చేయడం అసంభవమని కార్యకర్తలు తెగేసి చెప్తున్నట్టు తెలిసింది. ఇలా అయితే ఎన్నికల్లో ఎలా గెలుస్తామని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.