4న మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
- తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతంలోనే కృతజ్ఞత సభ
- జడ్పీటీసీ నుంచి సీఎం వరకు 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన నేలపై ఆయన జూలై 4న కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు.
2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జడ్పీటీసీగా ఆయన తొలి విజయం సాధించారు. ఆ గెలుపే ఆయన ప్రజాప్రతినిధి జీవితానికి పునాది వేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ ఎమ్మెల్యేగా, మల్కాజ్‌గిరి ఎంపీగా, చివరకు ముఖ్యమంత్రిగా ఆయన అంచెలంచె లుగా ఎదిగారు. ఈ ప్రయాణంలో తనకు తొలి రాజకీయ పట్టం కట్టిన మిడ్జిల్ ప్రజలను ఆయన మరిచిపోలేదు.
తనను నడిపించిన మూలాలను గుర్తు చేసుకుంటూ సీఎం రేవం త్‌రెడ్డి పలుమార్లు ఆత్మీయుల వద్ద అను భవాలను పంచుకున్నట్లు ఆయన సన్నిహితు లు చెబుతున్నారు. తాను మొక్కిన గుడి.. తన ప్రాంతంలో చదువు నేర్పిన బడి.. తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజలు తన గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించు కున్నారని ఆయన భావిస్తున్నారు. వారికి ఎంత చేసినా ఆ రుణం తీర్చుకోలేననే భావనతోనే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది అనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేస్తారు. మిడ్జిల్ సమీపంలో ఆనాటి లీడర్ గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
స్వతంత్రంగానే రాజకీయాల్లోకి..
విద్యార్థి దశలో ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్రంగానే అడుగుపెట్టారు. మిడ్జిల్ జడ్పీటీసీగా గెలుపొందిన తర్వాత 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి గా పార్టీని నడిపించి, 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. డిసెంబరు 7న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రయా ణానికి ఆది మిడ్జిలేనని, అందుకే తన 20 ఏళ్ల ప్రజాప్రస్థానాన్ని ప్రారంభమైన నేలపై గుర్తుచే సుకోవాలని నిర్ణయించారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన ప్రజలకు నమస్కరించేందుకు, తన వెన్నంటి నడిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ సభను వేదికగా చేసుకోనున్నా రు.
మిడ్జిల్ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే తనను రాష్ట్ర సేవకు తీసుకొచ్చిందనే భావనతో సీఎం ఈ పర్యటనకు బయల్దేరుతున్నారు. తొలి గెలుపునిచ్చిన నేలపై నిలబడి కృతజ్ఞతలు చెప్పబోతున్న ఈ కార్యక్రమం రేవంత్‌రెడ్డి ప్రస్థానంలో భావోద్వేగ ఘట్టంగా నిలవనుంది.






