నేడు కాలేజీలు బంద్
- బీసీ విద్యార్థి సంఘం పిలుపు
- అఖిల పక్ష విద్యార్థి సంఘాల మద్దతు
- కాంగ్రెస్‌ను పాతరేసైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సాధించుకుంటాం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కాలేజీల బంద్ చేపట్టనున్నారు. ఈ బంద్‌కు అఖిల పక్ష విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతరేసైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సాధించుకుంటామని అన్నారు. రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తి వేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాత పద్ధతిలోనే ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల దగ్గర ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు చెప్పిందని అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఎందుకు సమర్ధవంతంగా వాదించలేదని ప్రశ్నించారు.
ప్రజాప్రభుత్వం అయితే ఫీజుల ఆకాంక్షను ఎందుకు గుర్తించడం లేదన్నారు. నేడు జరగబోయే బందుకు మంత్రి భట్టి విక్రమార్కను ముందు పెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బంద్‌కు కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు.
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటి కొండ విక్రమ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, జాతీయ నాయకులు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, సిపిఐ నాయకులు పి.వెంకటస్వామి గౌడ్, మాదేసు రాజేందర్, డివైఎఫ్ ఐ నాయకులు జావేద్, పిడిఎస్ యు నాయకులు నాగేశ్వరరావు, సుమంత్ లింగస్వామి, నరిసింహ నాయక్, సురేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు.






