10న విద్యాసంస్థల బంద్
- పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్ధి సంఘాలు
- సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం
- వామపక్ష విద్యార్ధి సంఘాలు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతులలేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి అనేక సమస్యలు పేరుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటి పరిష్కారంపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని వామపక్ష విద్యార్ధి సంఘాలు (ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ) రాష్ట్ర కమిటీలు ఆరోపించాయి.
తెలంగాణ రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల10న కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు, తల్లిదండ్రులు, మేధావులు సహాకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్ధూం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), కె.మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్(ఏఐఎస్‌ఎఫ్), పొడపంగి నాగరాజు(పీడీఎస్‌యూ), ఎస్.అనిల్(పీడీఎస్‌యూ), పల్లె మురళీ, గడ్డం నాగర్జున(ఏఐఎఫ్‌డీఎస్), నీతీష్ (ఏఐడీఎస్‌వో), మన్నె కుమార్ (ఏఐపీఎస్‌యూ)లు పాల్గొని బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, బాలికలు, మహిళా విద్యార్థుల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఈ బంద్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర. కిరణ్, కె.అశోక్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పల శాంతి కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.






