ట్రాఫిక్‌లోనే సీఎం ప్రయాణం
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఒక లైన్‌లోనే సీఎం కాన్వాయ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి.. జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్న సీఎం
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ సామాన్య ప్రజల ఇబ్బం దులను తొలగించే దిశగా కీలక అడుగు వేశారు. సాధారణంగా వీవీఐపీల కాన్వాయ్ వెళ్తుందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేయడం ఆనవాయితీ. కానీ, అందుకు భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సీఎం, వెంటనే పోలీసు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం సరైన పద్ధతి కాదని, ప్రజల సమయాన్ని వృథా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీకి, ట్రాఫిక్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనాలను పూర్తిగా నిలిపివేయకూడదని, ప్రజలకు, ముఖ్యంగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకమూ కలగించవద్దన్నారు.
సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేస్తూ, ఇతర వాహనాలను అనుమతించాలని సీఎం సూచించారు. ముఖ్య మంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి తన నివాసానికి తిరిగొచ్చే సమయంలో ఎక్కడా ట్రాఫిక్‌ను స్తంభింపజేయలేదు. కాన్వాయ్ వెళ్లే మార్గం లో కేవలం ఒక లైన్‌ను మాత్రమే కేటాయించి, మిగిలిన లైన్లలో సాధారణ వాహ నాల రాకపోకలను కొనసాగించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే తన పాలనలో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ట్రాఫిక్‌లో ప్రయాణిం చడం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.






