3 August, 2026 | 4:00 PM

సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు సాధించాలి

02-09-2025 11:39 PM

రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి

రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరగాలి

ఏరియా జీఎంలకు సీఎండీ బలరామ్ స్పష్టీకరణ

మంచిర్యాల,(విజయక్రాంతి): బొగ్గు రంగంలో పోటీని  ఎదుర్కోవడానికి వీలుగా ప్రతీ ఒక్క ఉద్యోగి తన వంతు బాధ్యతగా బొగ్గు నాణ్యత పెంపుదలకు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేయాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ నాయక్ స్పష్టం చేశారు. మంగళ వారం సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, నూతన ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

భారీ వర్షాల వల్ల ఉత్పత్తికి విఘాతం కలిగిందని, జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, ప్రస్తుత లక్ష్యాలను సాధించడానికి ఇకపై రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. రోజుకు 12.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలన్నారు. వర్షాకాలం ఓపెన్ కాస్టు గనుల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. యంత్రాల వినియోగాన్ని పెంచాలని, ప్రతీ ఒక్క ఉద్యోగికి కేటాయించిన 8 గంటల షిఫ్ట్ సమయాన్ని కంపెనీ ఉత్పాదకతకు వినియోగించేలా చూడాలన్నారు. కొత్త ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

దుబారా ఖర్చును తగ్గించాలి...

అన్ని ఏరియాల్లోనూ అనవసర దుబారాను నివారించి పొదుపు పాటించేలా ఏరియాల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలనీ సిఎండి బలరాం నాయక్ కోరారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో అన్ని విభాగాలు, అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ఇందులో అలసత్వాన్ని ప్రదర్శిస్తే  సహించేది లేదని హెచ్చరించారు.  సింగరేణి ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ ఎస్టేట్స్ విభాగం అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, రికార్డులను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ ఏడాది ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అనుమతులు వెంటనే సాధించాలన్నారు.

కొత్తగూడెంలో వీకే కోల్ మైన్, ఇల్లందులో జేకే ఓసి గనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభించదలచుకున్న మూడు గనుల వల్ల 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్న గనుల వల్ల మరో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వీటి అనుమతుల పురోగతిపై రోజు వారీగా సమీక్ష నిర్వహించాలని సూచించారు.