పీఎస్‌ఆర్ డైరెక్షన్‌లో సీఎం సభ!
- జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు, సమన్వయం, జన సమీకరణపై ఆసక్తికర చర్చ
- సభ బాధ్యతలు ప్రేమ్ సాగర్ రావు చేతుల్లో..
- పీఎస్‌ఆర్ దృష్టి సారించడంపై పార్టీలో ప్రత్యేక చర్చ
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే29(విజయ క్రాంతి): జిల్లాలో జూన్ 1న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ రాజకీయం గా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద జరగనున్న ఈ భారీ సభను విజయవంతం చేసే బాధ్యతలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అప్ప గించడంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం భారీ బహిరంగ సభలను విజయవంతం చేయడంలో ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఇంద్రవల్లిలో నిర్వహించిన భారీ సభను లక్ష మందికి పైగా జనంతో విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అదే అనుభవాన్ని దృష్టిలో పె ట్టుకుని సీఎం సభ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే ఈ బాధ్యతల అప్ప గింత వెనుక జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలే ప్రధాన కారణ మా..? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్లో పలువురు నా యకులు వేర్వేరు వర్గాలుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్య నాయ కుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే అభిప్రాయాలు కార్యకర్తల్లో కూ డా వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సభ ఏర్పాట్లను ఒకే నాయకత్వంలో నడిపించి, అన్ని వర్గాలను సమన్వయం చేయా లని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో జిల్లాలోని కీలక నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
జిల్లా కాంగ్రెస్లో కీలక నేతలైన డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్,డిసిసి మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు సభ విజయవంతం కోసం సమిష్టిగా పనిచేస్తారా..? లేక అంతర్గత విభేదాలు మరోసారి బయటపడతాయా..? అన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సీఎం సభ విజయ వంతం కావాలంటే భారీ స్థాయిలో జన సమీకరణ కీలకంగా మారనుంది. ఇప్పటికే మండలాల వారీగా కార్యకర్తలకు లక్ష్యాలు కేటాయించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి ప్రజలను సభకు తరలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యువజన, మహిళా, అనుబంధ విభాగాలను కూడా రంగంలోకి దింపి జన సమీకరణపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో అధికారంలో లేకపోవడంతో నిరుత్సాహానికి గురైన క్యాడర్కు ఇప్పుడు ప్రభు త్వం తమదేనన్న భావన కల్పిస్తూ కార్యకర్తలను చైతన్యపరచే ప్రయత్నం జరుగుతోంది. సీఎం సభను కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే వేదికగా మలచాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద సభా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పార్కింగ్, భద్రత, తాగునీరు, వైద్య సేవలు, ప్రజల రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై అధికారులు, పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ అధికారులు, పార్టీ శ్రేణులతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన అనుభవం ప్రేమ్ సాగర్ రావుకు ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే వ్యూహంతో ఇప్పుడు సీఎం సభను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి జిల్లా కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం సభ కాంగ్రెస్కు కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. జిల్లాలో పార్టీ బలం, నాయకుల ఐక్యత, కార్యకర్తల చైతన్యం, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు అద్దం పట్టే కీలక రాజకీయ పరీక్షగా మారింది.






