5 April, 2026 | 4:34 AM

విద్యను కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు

05-04-2026 12:30 AM
  1. కార్పొరేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం

టీఎస్ యుటిఎఫ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని, ఒక గ్లోబల్ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పాఠశాలల పట్ల చేసిన వ్యాఖ్యలు కార్పొరేట్ విద్యా వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిరూపిస్తున్నాయని టిఎస్‌యుటిఎఫ్ విమర్శించింది. ఈ మేరకు యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకన్న శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అభ్యసనా సామర్థ్యాలు దాదా పు ఒకేవిధంగా ఉన్నాయని అసర్, నాస్ తదితర సర్వేలలో ఇది తేటతెల్లమైందన్నారు. కానీ ఆ విషయాన్ని విస్మరించి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసనా సామర్థ్యాలు లోపించాయని సీఎం మాట్లాడడం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి దోహదం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.

విద్యాశాఖ మంత్రి అయి కూడా ఒక కార్పొరేట్  పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరు కావడం సమంజసం కాదని, అక్కడ ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిపై ఖర్చు ఎక్కువగా అవుతున్నట్లు పేర్కొనటమంటే పరోక్షంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడంగానే భావించాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యవేక్షణ అధికారులు లేరు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల అసమతుల్యత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడం, లోపాలని సరిదిద్దేందుకు కృషి చేయకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.