22 June, 2026 | 9:30 PM

సీఎం మౌనముద్ర!

15-06-2024 12:36 AM
  1. రెండు రోజులుగా ఇంటికే పరిమితం

నివాసానికే వెళ్లి కలుస్తున్న మంత్రులు

పలువురు పార్టీ సీనియర్లతో చర్చలు 

కాళేశ్వరం, విద్యుత్ విచారణపై దృష్టి 

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా చర్చ! 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత రెండు రోజులుగా  ఇంటికే పరిమితమయ్యారు. సచివాలయానికి కూడా రావటం లేదు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై కూడా సమీక్షలు చేయలేదు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత పెద్దగా కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు లేవు. టెట్ ఫలితాలను కూడా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి అధికారులను పిలిపించుకొని విడుదల చేశారు.

ఇంటికి వెళ్లినా అపాయింట్ మెంట్ ఇచ్చిన వారినే కలుస్తు న్నారు. అయితే అధికారుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనే సీఎం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన   కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిపై ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై సంబంధిత అధికారులు, పార్టీ నేతలతో నివాసంలోనే సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. 

మంత్రులతో మంతనాలు

శుక్రవారం సీఎంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా కలిశారు. విద్యుత్ కొనుగోళ్లపై జరుగుతున్న విచాచరణ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులపై విచారణ, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీఎం చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కొత్తగా 5 మద్యం కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలకు ముడుపులు ముట్టాయని విపక్షాల నుంచి విమర్శలు రావడంతో వాటి లైసెన్స్‌లను  తాక్కాలికంగా రద్దు చేసింది. వీటిపై ముందుకు ఎలా వెళ్లాలనే అంశంపైన సీఎంతో మంత్రి జూపల్లి చర్చించినట్లు సమాచారం. కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలకు అనుకూలంగా పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

క్యాబినెట్ సమావేశంలోగానీ, రివ్యూలలోగానీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే.. అధికారికంగా బయటికి చెప్పక ముందే బీఆర్‌ఎస్ నేతలకు సమాచారం చేరుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అనుమానిస్తున్నారు. కొందరు అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సహచర మంత్రులకు సూచించినట్లుగా తెలిసింది. కొన్నేళ్లుగా ఒకే దగ్గర పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసిందని సమాచారం. ఒకేసారి పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మిగతావారిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలనే అంశంపైన సీఎం దృష్టి పెట్టారు. 

నామినేటెడ్ పదవుల పందేరం ఎలా?

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రభుత్వం 37 మందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. వెంటనే నోటిఫికేషన్ రావడంతో వారు బాధ్యతలు స్వీకరించలేదు. మరో 17 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వారి జాబితాపైన కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో నియమించిన 37 మందిలో ఐదారుగురిపైన ఒకరిద్దరు మంత్రులు, పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో ఆ జాబితాలో మార్పులు ఉంటాయని చర్చ కూడా జరుగుతోంది. మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినవారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన పార్టీ నేతలతో సీఎం చర్చిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అంతే కాకుండా ఎంపీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓటు శాతం, కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువగా రావటంపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.