సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీఎంఎస్ వినతి
బెల్లంపల్లి, జూన్ 23: సింగరేణికి నూతన బొగ్గు బ్లాకులను కేటాయించాలని కోరుతూ బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో సింగరేణి సంస్థకు సంబంధించిన పలు అంశాలపై మంత్రితో వారు చర్చించారు. కొత్త బ్లాకులను కేటాయించి సింగరేణిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి సింగరేణికి చెల్లించాల్సిన రూ.29 వేల కోట్ల బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సింగరేణి ౪ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కోలిం డియా మాదిరిగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించేలా యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు కారంపూడి శ్రీనివాసరాజు, ప్రదీప్‌కుమార్, రంజిత్‌కుమార్, సంతోష్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు డొనికెల రమేష్, చెట్టు వీరన్న ఉన్నారు.






