22 July, 2026 | 2:04 AM

కార్యక్షేత్రంలోకి ‘కాక్రోచ్’

22-07-2026 12:00 AM

విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, అవినీతి, నీట్ పేపర్ లీక్ ఘట న, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై జంతర్ మంతర్ వేదిక గా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు దేశవ్యాప్తంగా విశేష స్పంద న లభించడం ముదావహం. విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు ఈ దీక్షకు మద్దతు తెలపడం యువతకు నైతిక బలాన్నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పారదర్శకతను, జవాబుదారీతనా న్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు బయలుదేరిన యువతపై లాఠీచార్జి జరగడంతో ఈ ఉద్యమం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నెల రోజుల నుంచి యువత చేస్తున్న ఉద్యమానికి కేంద్రం తలొగ్గుతుందా, జెన్ జీ పోరాటం ఫలిస్తుందా? అన్న విషయాన్ని పక్కనపెడితే, దేశంలోని యువతను ఇది ఏకం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఒక వ్యంగ్య వ్యాఖ్య మూలంగా పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ యువతకు ఓ పోరాట వేదికగా మారడం విశేషం. ఆన్‌లైన్ వేదికగా ప్రారంభమై, అనతికాలంలోనే కార్యరంగంలోకి దిగిన ‘కాక్రోచ్’ దేశం దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రమంలో లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన నీట్ పేపర్ లీక్ ఘటన ఈ ఉద్యమానికి మరింత ఊతమిచ్చిందనే చెప్పాలి. దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యార్థులకు సంబంధించిన సమస్య కావడంతో యువతతోపాటు తల్లిదండ్రులను కూడా ఇది కదిలించింది. అయితే, ఈ ఉద్యమం ఇప్పటికే ఒక కీలకమైన మార్పునకు బీజం వేసింది. గతంలో ఉపాధి, ఉద్యోగాలు, పరీక్షలకు మాత్రమే పరిమితమైన యువత ఇప్పుడు వ్యవస్థలోని లోపాలపై ప్రశ్నించే స్థాయికి చేరుకోవడం ఈ ఉద్యమం సాధించిన ప్రధాన విజయం.

వ్యవస్థాగత లోపాలపై దేశ యువతలో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న అసంతృప్తి, అసహనం ఇప్పుడు బయటపడుతున్నది. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర ఎంత కీలకమో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పటికే సమాజాన్ని, ముఖ్యంగా యువతను చైతన్యపరచడంలో సఫలమైంది.

హక్కుల కోసం సంఘటితంగా పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయనే నమ్మకాన్ని బలపరిచింది. విద్య అనేది పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం కాదని; అది పారదర్శకతతోపాటు సమాన అవకాశాలు, న్యాయాన్ని కూడా అందించాలని ఈ ఉద్యమం దేశానికి గుర్తుచేసింది. యువత తమ భవిష్యత్తు కోసం స్వయంగా ముందుకువచ్చి ప్రశ్నించడం శుభపరిణామం. యువత ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.