calender_icon.png 10 August, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన ఆలయ గోడ

10-08-2025 12:19:29 AM

- 8 మంది మృతి

- ఢిల్లీలోని జైత్పూర్‌లో ఘటన

- దేశ రాజధానిలో దంచి కొడుతున్న వర్షాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు సౌత్ ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలోని హరినగర్‌లో ఆలయ గోడ కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి నుంచి హరినగర్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో శనివారం ఉదయం పాత ఆలయానికి ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలింది.

ఈ సమయంలో పక్కనే ఉన్న జగ్గీలలో నివసిస్తున్న చెత్త విక్రయదారుల దారులపై పడింది. వారంతా గాఢ నిద్రలో ఉండటంతో శిథిలాల్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బలగాల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఏయిమ్స్, సప్ద్‌ర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

వీరిలో కొంతమంది చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిని షబీబుల్ (30), రబీబుల్ (30) మట్టు అలీ (45), రూబినా (25), డాలీ (25), హషీబుల్ (6), రుక్సానా (6), హసీనా(7)లుగా గుర్తించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. అటు హిమాచల్ ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.