calender_icon.png 18 July, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ అభిలాష అభినవ్

18-07-2025 12:16:28 AM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ... జిల్లాలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విత్తన దుకాణాల్లో నిరంతరం తనిఖీలు జరపాలని, రైతులకు నష్టం జరగకుండా తక్షణ స్పందనతో వ్యవహరించాలని సూచించారు.

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇప్పటివరకు 32 బాల కార్మికులు గుర్తించగా, 19 కేసులు నమోదయ్యాయని చెప్పారు. చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్చాలని, యజమానులపై కేసులు నమోదు చేసి వ్యాపార లైసెన్సులు రద్దు చేయాలన్నారు. బాల్యవివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 12 బాల్యవివాహాలు అడ్డుకున్నామని తెలిపారు. పాఠశాలల్లోని 72,876 విద్యార్థినులకు గుడ్ టు, బ్యాడ్ టు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించామని చెప్పారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఎంపీల చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నిబంధనలకు విరుద్దంగా చికిత్సలు చేసేవారిపై కేసులు నమోదు చేయాలనీ ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో ఇప్పటివరకు 51 కేసులు నమోదవగా, 39 కేసులకు పరిహారం చెల్లించామని, 12 కేసులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 73 కేసులు నమోదు కాగా, 145 మంది అరెస్టయ్యారని, 525 కేజీల 305 గ్రాముల గంజా సీజ్ చేశామని వెల్లడించారు. స్కూల్, కాలేజీల సమీపంలోని 400 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్లు విక్రయించడాన్ని నిషేధించనున్నట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, రోడ్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత శాఖలను కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు ఎన్ ఎ ఏ ఐ, ఆర్ అండ్ బి శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా కడ్తాల్, సోన్ గ్రామస్తులు, ఇతర గ్రామాల పరిధిలోని నేషనల్ హైవే రూట్లపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వేగ నియంత్రణ సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్లో డౌన్ జోన్‌లను ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో బిక్షాటన నిర్మూలన, ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, బాల్యవివాహాల నియంత్రణలో సంక్షేమ, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొనసాగుతుందన్నారు. చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణకు తనిఖీలను తీవ్రతరం చేశామని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.