calender_icon.png 18 July, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

18-07-2025 12:16:31 AM

జగిత్యాల అర్బన్, జూలై 17 (విజయక్రాంతి): జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. గురువారం పాఠశాలలోని విద్యార్థులు అల్పాహారం చేసిన తర్వాత వాంతులు చేసుకోగా కొంతమంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతుండడాన్ని గమనించిన ప్రిన్సిపల్ వెంటనే విద్యార్థులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురు విద్యార్థులను ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించగా, మరో 30 మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలోనే వైద్య సిబ్బందితో చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎంపిఈఓ రవిబాబు తదితరులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అయితే రాత్రి విద్యార్థులకు వడ్డించిన చికెన్ లో కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారని అధికారులు చెబుతున్నారు. కాగా తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎంపీఈఓ రవిబాబు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాఠశాలలో శానిటేషన్ పనులనుచేపట్టారు.