13 August, 2026 | 3:45 AM

నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి

13-08-2026 01:35 AM

ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విద్యార్థుల విద్య, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

చర్ల, ఆగస్టు 12, (విజయక్రాంతి): నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టును, ఏకలవ్య మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ప్రాజెక్టులోని ప్రస్తుత నీటిమట్టం, నీటి ప్రవాహం, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ, సిబ్బంది తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో 73.80 మీటర్ల నీటిమట్టం ఉందని, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు అని అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం వస్తుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది నీటి ప్రవాహం తక్కువగా ఉందని తెలిపారు.   బుధవారం సుమారు 2,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న నీటి వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 24 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ చర్లలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, ఆ రోజు తరగతులకు హాజరైన విద్యార్థుల సంఖ్యను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహన, అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.  పాఠశాలలోని కిచెన్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. వంటగది, పాఠశాలలోని హెల్త్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట చర్ల తాసిల్దార్, ఇరిగేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులు  పాల్గొన్నారు.