17-02-2026 01:49:33 PM
జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆకస్మికంగా తనిఖీ
అచ్చంపేట ఫిబ్రవరి 17: విద్యార్థినిలు రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి.. మెరుగైన ర్యాంకులు సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్(Collector Badavath Santosh) సూచించారు. మంగళవారం అచ్చంపేట మండలం ఐనోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులు, భోజన నాణ్యత పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కిచెన్ షెడ్, కూరగాయలు, బియ్యం, పప్పులు, ఇతర సామగ్రిని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న పదో తరగతిలో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా బాలికలను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. విద్యాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా విద్యావంతురాలు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని విద్యార్థినులకు సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల గణిత, ఆంగ్ల సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.