యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యం
* ఐటిడిఏ పీఓ మంద మకరందు..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అందించిన యోగా దినోత్సవ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, ఆశ్రమ గిరిజన విద్యార్థినులతో కలిసి అతిథులు వివిధ యోగాసనాలను ఆచరించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు.
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో యోగా విశేషంగా దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, యోగా మన శరీరానికి సహజమైన ఔషధంలా పనిచేస్తుందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు.






