మహబూబాబాద్ డీసీఓపై కలెక్టర్ అసంతృప్తి
- ప్రభుత్వానికి సరెండర్
- తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశం
మహబూబాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా సహకార అధికారి (డీసీఓ) ఎ. విజయకుమారి పనితీరుపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ అధికారుల ఆదేశాలను పాటించకపోవడం, ముఖ్యమైన పరిపాలనా అంశాలపై జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వకపోవడం, అవసరమైన సందర్భాల్లో ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, విధుల నిర్వహణలో పదేపదే ప్రక్రియాపరమైన లోపాలకు పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు.
ఈ మేరకు కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ కమిషనర్కు లేఖ రాశారు. డీసీఓ విజయకుమారి సేవలను తక్షణమే ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొంటూ, మహబూబాబాద్ జిల్లాకు సమర్థుడైన, తగిన అధికారిని జిల్లా సహకార అధికారిగా వీలైనంత త్వరగా నియమించాలని కోరారు. ఆదేశాల అమలులో లోపాలు డీసీఓగా విజయకుమారి పనితీరు సంతృప్తికరంగా లేదని కలెక్టర్ లేఖలో స్పష్టం చేశారు.






