గంజాయి రవాణా భగ్నం
ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు..
23.02 కిలోల గంజాయి స్వాధీనం
నాగోలు, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గం జాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్‌ఓటీ ఎల్బీనగర్ జోన్, నాగోలు పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 23.02 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.11.51 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11న ఒడిశా నుంచి రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో నాగోలు ఎక్స్రోడ్డు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద తనిఖీలు చేపట్టారు.
డిక్కీల్లో దాచిన ఆరు ప్యాకెట్లలో 23.02 కిలోల గంజాయి లభ్యమైంది. అరెస్టయిన వారిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన త్రినాథ్ నిరికె (40), సోనా హుంతల్ (28)గా గుర్తించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ’కమ్ము’ కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ, ఎస్‌ఓటీ అధికారులు, నాగోలు పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు.






