ఆవాస విద్యాలయాల తనిఖీలో లోపాలపై కలెక్టర్ ఆగ్రహం
ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీకి ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలో ఉన్న సమగ్ర శిక్ష పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం, పట్టణ బాలుర ఆవాస విద్యాలయం (URS)లను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏడవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థుల ఇంగ్లీష్ పఠన సామర్థ్యాన్ని పరీక్షించిన కలెక్టర్, విద్యార్థుల ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు సరిగా చదవలేకపోవడానికి గల కారణాలపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించిన కలెక్టర్, బోధనలో లోపాలు ఎందుకు ఉన్నాయో వివరణ కోరారు. పట్టణ స్థాయి పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు.
స్టోర్రూమ్ను పరిశీలించిన కలెక్టర్, అవసరమైన సరుకులు తగినంతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరఫరాలో లోపాలు ఎందుకు ఉన్నాయో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అనంతరం కిచెన్ను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత లోపాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో వీధి బాలలు, రక్షించబడిన బాలలు, డ్రాప్ అవుట్ బాలలు చదువుతున్నందున వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ అన్నారు.
అయితే పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.




