మైసమ్మ ఆలయ భూముల ఆక్రమణపై సర్వే
- కబ్జాదారుల చెర వీడిన కోట్ల విలువజేసే ఆలయ భూమి
ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ యంత్రాంగం
హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 9 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సోమశిల మీదుగా నూతనంగా నిర్మితమవుతున్న జాతీయ రహదారికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసమ్మ ఆలయ భూములకు ధరలు అమాంతం పెరిగాయని అధికార పార్టీ లీడర్లు ఆ భూములపై కన్నేశారు. ఒక్కో గజం భూమికి వేళల్లో ధర పలుకుతుండడంతో మైసమ్మ ఆలయ భూమి పరిసరాల్లోని ప్రైవేటు వ్యక్తుల భూములను కొనుగోలు చేసి ఆలయ భూమిని ఆక్రమించేందుకు పథకం వేసుకున్నట్లు బాహాటంగా విమర్శలున్నాయి.
ఆ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు భూకబ్జాదారులు కుట్రలకు తెరలేపినట్లు చర్చ జోరందుకుంది. దీన్ని పసిఘట్టిన విజయక్రాంతి మైసమ్మ ఆలయ భూములపై కబ్జారాయుల కన్ను అనే శీర్షికన ఈనెల 2న కథనాన్ని ప్రచురించింది. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులమంటూ కొంతమంది అధికార పార్టీ లీడర్లు స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులను మచ్చిగ చేసుకుని ఖాళీ జాగాలపై కన్నేసి భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయ భూమి పరిసరాల్లో కొనుగోలు చేసిన పట్టా భూమిని ఎక్కువ స్థలాన్ని కబ్జా చేసి వెంచర్లుగా మార్చేందుకు నిర్మాణాలు చేపట్టినట్లు తెలిసింది. వార్త కథనం అనంతరం సదరు మంత్రి మందలిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు గురువారం మైసమ్మ ఆలయ భూములను సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. దీంతో మైసమ్మ భక్తులతో పాటు ఆలయ ఈవో రామేశ్వర శర్మ హర్షం వ్యక్తం చేస్తూనే విజయక్రాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సదరు నేతల వ్యవహారం పట్ల సమగ్ర విచారణ జరిపితే మరిన్ని భూకబ్జాలు, అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.




