మండలంలో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన.. అభివృద్ధి పనులపై సమీక్ష
నూతనకల్, జూలై 8 : జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బుధవారం మండలంలో పర్యటించి, వివిధ అభివృద్ధి పనులు మరియు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ప్రధానంగా నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సబ్-సెంటర్ల పనులను వేగవంతం చేయాలని, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఆధునీకరణకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక శ్రీ వెంకటేశ్వర బయో-ప్రోడకట్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి, యూనిట్ వ్యయం, ఉత్పత్తి సామర్థ్యం మరియు విక్రయాల తీరుపై ఆరా తీశారు.నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.’భూభారతి చట్టం-2025’ కింద 2,021 మంది లబ్ధిదారులకు చెందిన 2,960 ఎకరాల భూములకు పట్టాలు మంజూరు చేసే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, అందుకు సంబంధించి రోజువారీ సర్వే నివేదికలను సమర్పించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ-2026లో భాగంగా, ఈసీఐ యాప్ ద్వారా చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్షించారు. మొత్తం 29,261 మంది ఓటర్లలో, ఇప్పటివరకు 8,116 మంది వివరాలను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ మరియు సర్వే శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






