23 July, 2026 | 2:26 PM

పకడ్బందీగా గ్రూప్ పరీక్షలు

01-06-2024 12:20 AM

పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు

అభ్యర్థులు చెప్పులు ధరించి పరీక్షకు హాజరవ్వాలి 

నేటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (విజయక్రాంతి) : టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జూన్ 9న నిర్వహించబోయే గ్రూప్  1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని హైదరా బాద్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ అన్నారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై రీజినల్ కో ఆర్డినేటర్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, డిపార్ట్‌మెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్  పరీక్ష కోసం జిల్లాలో 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 40,569 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారని చెప్పారు. పరీక్ష ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు ఉంటుందని, 10గంటలకు గేట్లు మూసివేస్తారని చెప్పారు. అభ్య ర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్, సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి పరీక్షకు హాజరవ్వాలని సూచించారు. అభ్యర్థుల కోసం పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతులు కల్పించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అదనపు బస్సులను నడుపాలని ఆర్టీసీని కోరారు. అత్యవసరమైన వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. నేటి (జూన్ నుంచి www.tspsc.gov.in అనే వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు చెప్పారు.