calender_icon.png 11 February, 2026 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 గంటల వరకు 10.56 శాతం పోలింగ్ నమోదు

11-02-2026 01:01:41 PM

జిల్లా ఎన్నికల బిఅధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీల  మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న 2వ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 106 వార్డుల్లో పోలింగ్ జరుగుతుండగా, 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 19,584 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 10.56 శాతం పోలింగ్ నమోదైంది.

పట్టణాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి:

అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు, 35 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 16,850 మంది ఓటర్లలో 3,520 మంది ఓటు హక్కు వినియోగించుకుని 20.89 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు, 201 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 1,34,775 మంది ఓటర్లలో 13,341 మంది ఓటు వేసి 9.89 శాతం పోలింగ్ నమోదైంది.

ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు, 52 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 33,723 మంది ఓటర్లలో 2,723 మంది ఓటు హక్కు వినియోగించుకుని 8.07 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.